గణతంత్ర వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి

Jan 27 2021 10:28 AM

అమరావతి: సమర్థవంతమైన న్యాయం అందించే విషయంలో న్యాయవ్యవస్థ ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కొంటోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి అన్నారు. ఏపీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జస్టిస్‌ గోస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇలాంటి విమర్శలను ఆధిగమించడం సాధ్యమవుతుందని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని విమర్శలకు సమాధానం ఇద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు.

ఈ దిశగా మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, విధి నిర్వహణలో రాజీ లేకుండా పనిచేద్దామన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది లేమి, పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడం వంటివి న్యాయవ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థపై లేనంత భారం మనదేశ న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఏపీ హైకోర్టు మంచి సంప్రదాయాలను పాటిస్తోందని, ఇప్పుడు జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీ ఎస్‌.శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్‌ ప్రసంగించారు. 

లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి జెండా ఎగుర వేసి∙పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి, రిజి్రస్టార్‌ విజయలక్ష్మి, లోకాయుక్త డైరెక్టర్‌ (ఇన్వెస్టిగేషన్‌) కె.నర్సింహారెడ్డి, డైరెక్టర్‌ (లీగల్‌) టి.వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

 ఇది కూడా చదవండి:

ఏసీబీ అధికారి ఎం.శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం

యుఎస్ హౌస్ ప్రతినిధులు ట్రంప్ అభిశంసన అభియోగాన్ని సెనేట్‌కు అందజేస్తారు

అమెరికా పాలసీలను కఠినతరం చేయాలని బిడెన్ ఆర్డర్ పై సంతకం

Related News