రవాణా వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆ మేరకు కేసుల నమోదులో వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మోటారు వాహన చట్టాన్ని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది. దీన్ని అనుసరించి ఈ ఏడాది జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్ 177 నుంచి 199 వరకు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టనున్నారు.
రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధించనున్నారు. అంతర్‌రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి సారించనుంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదించింది.
లాక్‌డౌన్ సమయంలో పలు సేవలందించినట్లు సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి రవాణాశాఖ తెలిపింది. డ్రైవర్లకు లక్ష శానిటైజర్ల కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ కమిటీ వలస కూలీల తరలింపులో ముఖ్యపాత్ర పోషించిందని, 3,252 ఆర్టీసీ బస్సుల ద్వారా 96,700 మంది వలస కార్మికులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు వివరించింది. జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి వంతున 118 ఫుడ్ అండ్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు సేవలందించినట్లు తెలిపింది. 69 శ్రామిక్ రైళ్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి 1,07,338 మంది కూలీలను పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాలి నడకన వచ్చే 15 వేల మంది కూలీలను 464 ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి :
ఢిల్లీ: పీరగడిలో నకిలీ కాల్ సెంటర్, పోలీసులు 42 మందిని అరెస్టు చేశారు
అరియానా గ్రాండే తన ప్రియుడు డాల్టన్ గోమెజ్ తో నిశ్చితార్థాన్ని వెల్లడిస్తుంది
అమెజాన్ లో రూ.1 కోట్ల అమ్మకాలను అధిగమించి 4000 కు పైగా విక్రేతలు