11 జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు సన్నాహాలు

Jan 23 2021 10:32 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు విడతల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు అనంతరం ఎస్‌ఈసీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చిత్తూరు, గుంటూరు జిల్లాలను మినహాయించి మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో జిల్లాలో ఒక్కో రెవెన్యూ డివిజన్‌ చొప్పున 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని పంచాయతీలకు ఈ విడతలో ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 3 – 5 గంటల మధ్య సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.  

పంచాయతీ ఎన్నికలపై గతేడాది అక్టోబర్‌ 28న రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతుండటం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆందోళన చెందుతోందంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు కమిషన్‌కు ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కమిషన్‌ అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతోందని తెలిపారు.  

ఇది కూడా చదవండి:

బిబి 14: జాస్మిన్ భాసిన్ ఇంట్లో రీ ఎంట్రీ తీసుకోనున్నారు

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.5,000 కోట్ల పెట్టుబడితో పెయింట్స్ బిజ్ లోకి ప్రవేశించింది.

యూపీ తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఈ నగరంలో యోగి సర్కార్ ఆమోదం

Related News