గనుల శాఖలో అన్నీ ఆన్‌లైన్‌లోనే రాబడి పెంపు లక్ష్యంగా సంస్కరణలు చేయబడ్డాయి

Feb 08 2021 10:59 AM

అమరావతి: భూగర్భ గనుల శాఖ సంస్కరణల దిశగా సాగుతోంది. ఖనిజ దోపిడీ, అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రించడం ద్వారా రాబడి పెంపు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. విజిలెన్స్‌ తనిఖీలను ముమ్మరం చేసి ఖనిజ దోపిడీదారులకు భారీ అపరాధ రుసుం విధిస్తోంది. అక్రమాలకు పరోక్షంగా సహకరించిన అధికారులపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. ‘ఖనిజ వనరులను దోచుకుంటే ఎంతటివారైనా వదలొద్దు. కఠినంగా వ్యవహరించి ఖజానాకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోండి. అక్రమార్కులకు సహకరించినట్లు తేలితే అధికారులపైనా కొరడా ఝుళిపించండి’ అని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు.  

పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, మంజూరు విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్‌లైన్‌ విధానం వల్ల క్వారీ లీజులు, పర్మిట్లు, ట్రాన్సిట్‌ పాసులు పొందేందుకు అధికారుల వద్దకు పరుగులెత్తాల్సిన పని ఉండదు. ఇంటి నుంచో ఆఫీసు నుంచో దరఖాస్తు చేసుకుంటే చాలు. అధికారులు కంప్యూటర్లలో పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తారు. లీజుదారులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ఉన్న వాహనాలకే ట్రాన్సిట్‌ పాసులు జారీ అవుతాయి. మరోవైపు రాబడి పెంపు లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్‌ లీజులకు కూడా టెండరు విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు, బినామీ లీజుదారులు రాయల్టీ, ఇతర రుసుములు చెల్లించకుండా ఎగ్గొట్టి అక్రమంగా గ్రానైట్‌ తవ్వి రూ.వేల కోట్లు కాజేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ దర్యాప్తులో తేలడంతో ఎగ్గొట్టిన రాయల్టీ, అపరాధ రుసుము కలిపి చెల్లించాలంటూ గనుల శాఖ సంచాలకులు డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 105 మందికి ఇలా డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి. అక్రమాలకు సహకరించారనే అభియోగంపై కొందరు సహాయ సంచాలకులపైనా ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తద్వారా అక్రమార్కులపై ఉక్కుపాదం తప్పదని గట్టి సంకేతాలనిచ్చింది. 

ఇది కూడా చదవండి:

అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2021 నుంచి ప్రారంభం కానుంది.

త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోనుందట అనుష్క శెట్టితో కాదు, పెళ్లి కూతురు ఎవరు అనే విషయం కూడా తెలుస్తుంది.

ఈ సినిమా గురించి యువకుడు బెదిరింపు ట్వీట్ పంపాడు.

Related News