స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి నౌక 2022లో అందుబాటులోకి రానున్న విక్రాంత్‌

Jan 25 2021 01:00 PM

భారత రక్షణ రంగం నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌ నిర్మాణంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన ఐదో దేశంగా అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సరసన భారత్‌ స్థానం సంపాదించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది సీ ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 2022 నాటికి విశాఖలోని తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.

రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్‌ యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో కూడా బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో విక్రాంత్‌ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ క్లాస్‌ యుద్ధ నౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొ దటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. వాస్తవానికి 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది.

విక్రాంత్‌ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటున్న విక్రాంత్‌ జయమ్‌ సమ్‌ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకం స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటోంది. నాతో యుద్ధమంటే నాదే గెలుపు అనే అర్థం వస్తుంది. 1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌకా డిజైన్‌ మొదలు పెట్టగా 2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. వివిధ సాంకేతిక పనుల అనంతరం ఇటీవలే బేసిన్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు.

ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్‌ ప్రొపైల్లర్‌ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్, స్టీరింగ్‌ గేర్, ఎయిర్‌ కండిషనింగ్‌ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్‌ పంప్స్, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ, డెక్‌ మెషినరీతో పాటు అంతర్గత కమ్యూనికేషన్‌ పరికరాల్ని ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. ఈ ఏడాది మధ్యలో సీ ట్రయల్స్‌ పూర్తి చేసిన తర్వాత 2022 చివరిలో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. ఈ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఇండియన్‌ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.

ఇది కూడా చదవండి:

బర్త్ డే స్పెషల్: ఈ సినిమాతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న రియా సేన్

ఢిల్లీ: నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న 34 మంది అరెస్ట్ చేసారు

ఢిల్లీ బైక్ సేవా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షలాది వస్తువులు ధ్వంసమయ్యాయి

Related News