కోవిడ్–19 లాక్‌డౌన్ సమయం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగానికి రుణాల మంజూరుపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. రుణాల రికవరీ దారుణంగా పడిపోయింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడం, భౌతికదూరం పాటించడం వంటి కారణాలతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై సానుకూల ప్రభావం పడింది. ఈ విషయాలు దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా నాబార్డు నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ రంగానికి కిసాన్ క్రెడిడ్ కార్డులు, టర్మ్ రుణాల మంజూరు, రుణాల రికవరీ, డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు కనీస బ్యాంకింగ్ సేవలపై పడిన ప్రభావంపై జిల్లాల వారీగా నాబార్డు సర్వే నిర్వహించింది. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉండగా కొన్ని జిల్లాల్లో మోస్తరుగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఎటువంటి ప్రభావం చూపలేదు. లాక్‌డౌన్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో వ్యవసాయం, డెయిరీ, మత్స్యరంగం, ఉద్యానరంగంపై ప్రభావం పడింది. జీవనోపాధిపైన ప్రభావం చూపింది. దీంతో రైతులు రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
బ్యాంకుల రుణాల రికవరీపై దేశంలో 94 శాతం జిల్లాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది.కిసాన్ క్రెడిడ్ కార్డులపై రైతులకు రుణాల మంజూరుపై దేశ వ్యాప్తంగా 59 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది కేరళలో నూరు శాతం జిల్లాల్లో, అసోంలో 75, పశ్చిమ బెంగాల్‌లో 76, ఉత్తరప్రదేశ్‌లో 75, బిహార్‌లో 73, మహారాష్ట్రలో 71 శాతం జిల్లాల్లో రైతులకు రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది.కనీస బ్యాంకింగ్ సేవలైన డిపాజిట్లు, విత్‌డ్రాలపైన 50 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ఛత్తీస్‌గడ్‌లో 78 శాతం, జార్ఖండ్‌లో 75 శాతం, మహారాష్ట్రలో 68 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం కనిపించింది.టర్మ్ రుణాల మంజూరుపై 89 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది.
లాక్‌డౌన్‌లో రాకపోకలపై ఆంక్షలు కారణంగా ప్రాజెక్టును సందర్శించేందుకు బ్యాంకు సిబ్బంది ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. చిన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో వందశాతం, బిహార్, పంజాబ్, రాజస్థాన్‌లలో 95 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్‌లో 91 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలపై 63 శాతం జిల్లాల్లో సానుకూల ప్రభావం చూపింది. గతంలో డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇష్టపడని వారు కూడా లాక్‌డౌన్ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. దీనిపై అవగాహనలేనివారు కూడా ఇతరుల సహాయంతో చేశారు. కేరళలో 95 శాతం, పంజాబ్‌లో 91, రాజస్థాన్‌లో 90, హరియాణాలో 87, బిహార్‌లో 81 శాతం డిజిటల్ లావాదేవీలపై సానుకూల ప్రభావం నెలకొంది.
ఇది కూడా చదవండి:
భారత్ కు గెలుపు సులువు: పీటర్సన్ భారీ జోస్యం చెప్పారు
రైతుల ఆందోళన: 'వంతెనలు నిర్మించండి, గోడలు కాదు, రాహుల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు
బర్డ్ ఫ్లూ మధ్య వైశాలిలో 8000 కోళ్లు మృతి చెందాయి