ఏపీలో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి

Jan 20 2021 11:31 AM

ఏపీలో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవని ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ చేపడుతున్న చర్యల నుంచి పలు దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఐక్యరాజ్య సమితి తన వంతు తోడ్పాటును అందజేస్తుందని హామీ ఇచ్చారు. త్రిపాఠి ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్ర రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌తో కలసి విజయనగరం జిల్లాలోని వివిధ గిరిజన గ్రామాల్లో పర్యటించి ప్రకృతి సేద్యం(ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) కోసం అక్కడి గిరిజన రైతులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్న 93 గిరిజన గ్రామాల రైతుల పనితీరును ఆయన గమనించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. పర్యటనలో భాగంగా మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. త్రిపాఠి మాట్లాడుతూ ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సీఎం వైఎస్‌ జగన్‌ ముందుచూపును ప్రశంసించారు. హానికారక రసాయనాలు, సింథటిక్‌ ఎరువుల స్థానే ప్రకృతి సేద్యం పట్ల సీఎం చూపిస్తున్న ఆసక్తి ఎన్నతగినదన్నారు. ఈ లక్ష్య సాధనలో రాష్ట్రానికి తమవంతు తోడ్పాటును అందిస్తామని చెప్పారు.

ప్రతి గ్రామం ప్రకృతి సేద్య గ్రామంగా అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో హానికారక రసాయనాలు, సింథటిక్‌ ఎరువుల స్థానే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను మరింత విస్తరింప చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్వరలో ప్రకృతి సేద్యంపై రాష్ట్ర స్థాయిలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌ పాల్గొన్నారు.  

ఇది కూడా చదవండి:

ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలి,కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

శ్రీవారి పింక్‌ డైమండ్‌ మనుగడ విషయం ఫై దాఖలైన పిల్‌ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది

ప్రత్యేక సందేశంతో రామమందిర కోసం ముస్లిం మహిళ విరాళం

Related News