చిత్తడి నేలల్లో కనిపించిన ఏడు రకాల కొత్త పక్షి జాతులు

Jan 17 2021 01:53 PM

కొల్లేరు, ఉప్పలపాడు, కొండకర్ల మన రాష్ట్రంలో పక్షులు, వలస పక్షులకు స్థావరాలివి. పక్షి ప్రేమికులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ ప్రాంతాలనే సందర్శిస్తుంటారు. లేదంటే రాజస్తాన్, గుజరాత్‌ వంటి చిత్తడి నేలలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇప్పుడు విజయవాడ పరిసరాల్లోని చిత్తడి నేలల్లోనూ కొత్త పక్షులు కనువిందు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదుకాని ఏడు రకాల కొత్త పక్షి జాతులు కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తున్న 25 విదేశీ పక్షి జాతులు దర్శనమిచ్చాయి. వీటితో కలిపి మొత్తం 156 రకాల పక్షి జాతులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. విజయవాడ నేచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగర పరిసరాల్లోని చెరువులు, పంట పొలాల్లో చేపట్టిన తొలి విడత పక్షుల గణనలో వీటిని గుర్తించారు. 

విజయవాడ సమీపంలోని వెలగలేరు, కొండపావులూరు, నున్న, కవులూరు, పైడూరుపాడు, ఈడుపుగల్లు, ముస్తాబాద సహా 15 మంచినీటి చెరువులు, వాటి పరిసర ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల పొలాల్లో ఇప్పటి వరకు పక్షుల గణన చేశారు. జిట్టంగి (బ్లైత్స్‌ పిపిట్‌), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్‌ ఓర్ఫియన్‌ వార్బ్‌లెర్‌), మెడను లింగాడు (యురేసియన్‌ వ్రైనెక్‌), కోకిల డేగ (క్రెస్టెడ్‌ గోషాక్‌), ఉడతల గెద్ద (పాలిడ్‌ హారియర్‌), నీలి ఈగపట్టు పిట్ట (వెర్డిటర్‌ ఫ్లైకాచర్‌), నూనె బుడ్డిగాడు (బ్లాక్‌ రెడ్‌స్టార్ట్‌) పక్షులను కొత్తగా కనుగొన్నారు. నీటి పక్షులు–బాతులు (మైగ్రేటరీ వాటర్‌ఫౌల్‌), నామం బాతు (స్పాటెడ్‌ యురేసియన్‌ వైజన్‌), సూదితోక బాతు (నార్తర్న్‌ పిన్‌టైల్‌), చెంచామూతి బాతు (నార్తర్న్‌ షోవెలర్‌) వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 25 రకాల వలస పక్షులను గుర్తించారు. వీటిలో ఎక్కువ పక్షులు యూరోప్, రష్యా, మంగోలియా, సైబీరియా, చైనా నుంచి వలస వస్తున్నాయి. కొన్ని పక్షులు హిమాలయాలు, రాజస్తాన్, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వలస వస్తున్నాయి. గుర్తించిన 152 పక్షుల్లో 14 రకాల జాతులు 1972 వన్యప్రాణ రక్షణ చట్టం షెడ్యూల్‌–1 పరిధిలో ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం వీటిని వేటాడితే శిక్షార్హులే. 30 రకాల జాతులు తగ్గిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. 

అటవీ శాఖ మూడు, నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించే సర్వే తప్ప నిర్దేశించిన ప్రాంతంలో ఇప్పటి వరకు పక్షుల గణన ఏ జిల్లాలోనూ జరగలేదు. విజయవాడ నేచర్‌ క్లబ్‌ పేరుతో బండి రాజశేఖర్, దాసి రాజేష్‌వర్మ, డాక్టర్‌ కిశోర్‌నాథ్‌ మరికొందరు ఔత్సాహికులు ఐఐఎస్‌ఈఆర్, మథాయ్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో తొలిసారిగా ఈ గణన చేపట్టారు. అటవీ శాఖ సైతం ఇందులో పాలుపంచుకుంది. 28 మంది వలంటీర్లు వారాంతాలు, సెలవు రోజుల్లో 40 గంటలపాటు ఈ గణనలో పాల్గొన్నారు. రెండో విడత గణన ఈనెల నేటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగనుంది. 

విజయవాడ పరిసరాల్లో వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వస్తున్న వలస పక్షుల ఆవాసాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తొలిసారి చేపట్టిన పక్షుల గణనకు మంచి ఆదరణ వచ్చింది. రెండో విడత గణనలో మరిన్ని కొత్త పక్షులు కనిపిస్తాయని ఆశిస్తున్నాం.

ఇది కూడా చదవండి:

నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ 'ఒక్కసారి-ఇన్-ఎ-జనరేషన్' గ్రౌండ్ టెస్ట్ కు సెట్ అయింది

ఎయిమ్స్ డాక్టర్ పై కంగనా స్పందన'

రాశికా దుగల్ పలు టీవీ షోలలో పనిచేసింది మరియు ఇప్పుడు డిజిటల్ స్పేస్ లో ప్రశంసలు పొందింది.

Related News