సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వై. ఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో తొలివిడత కింద చేపట్టిన పోలవరం, వెలిగొండ, నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు సొరంగం (టన్నెల్), వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను గడువులోగా పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ ఛానల్ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయాలని గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యామ్‌వల్ల నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా వారికి పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రెండో విడత ప్రాధాన్యత కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా సమీక్షించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని అందువల్ల దీనిని నిర్దేశించుకున్న గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ ఫిబ్రవరి 10 నాటికి స్పిల్ వే బ్రిడ్జి పూర్తిచేస్తామని.. స్పిల్ ఛానల్‌లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ నాటికి స్పిల్ వేకు 48 రేడియల్ గేట్లను అమర్చుతామని అప్రోచ్ ఛానల్‌ను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాంలో రీచ్–1ను మార్చి నెలాఖరుకు, రీచ్–2ను ఏప్రిల్ నెలాఖరుకు, రీచ్–3ను మే నెలాఖరుకు, రీచ్–4ను మార్చికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని.. స్పిల్ వే మీదుగా గోదావరి వరదను మళ్లించి.. కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్)ను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.
కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిజైన్‌ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రేడియల్ గేట్లకు అమర్చే హైడ్రాలిక్ సిలిండర్లలో మిగిలిన వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం కాకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యాం కారణంగా నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని గోదావరికి వరద వచ్చేలోగా ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించకున్న ప్రణాళిక ప్రకారం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
పెన్నా నదిపైనిర్మిస్తున్ననెల్లూరు,సంగం బ్యారేజీల పనులను కూడా గడువులోగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మార్చి 31లోగా గేట్లను బిగించే పనులు పూర్తవుతాయని ఏప్రిల్‌లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే, సంగం బ్యారేజీలో రెండు వారాల్లో గేట్లను బిగించే పనులను ప్రారంభిస్తామని.. మార్చి ఆఖరుకు పూర్తిచేసి దీనిని కూడా ఏప్రిల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు వివరించారు.
ఇది కూడా చదవండి:
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య పోలాండ్‌లో గర్భస్రావం నిషేధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు
'2021 చాలా కాలం తర్వాత ప్రజలను తిరిగి సినిమా హాళ్లకు తీసుకువస్తుందని' వాని కపూర్ భావిస్తున్నారు
లెజెండరీ యాక్టర్ సిసిలీ టైసన్ 96 ఏళ్ళ వయసులో మరణించారు.