ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనం ,పబ్ జి మత్తు లో మరో నిండు ప్రాణం బలి

Oct 12 2020 06:25 PM

తిరుపతి : ‘పబ్‌జీ’ యువతను పిచ్చెక్కిస్తోంది. వారి జీవితాలతో ఆడుకుంటోంది. చివరకు ప్రాణాలను సైతం అలవోకగా తీసుకునేలా ప్రేరేపిస్తోంది. ఎందరో తల్లిదండ్రుల ఉసురుపోసుకుంటోంది. ప్రభుత్వం నిషేధించినా ఇంకా వెర్రితలలు వేస్తూనే ఉంది. పిల్లలు ఈ గేమ్‌ జోలికి వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక నవాబ్‌పేటలో నివాసం ఉంటున్న ఓ యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం లాక్‌డౌన్‌ సమయంలో పూట జరగడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లని పురమాయించారు. గేమ్‌కు దూరం కావాల్సి వస్తుందని ఆ యువకుడు ఇంటి గేటుకి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. 

మొన్న పోకెమాన్‌.. నిన్న బ్లూవేల్‌.. తాజాగా పబ్‌జీ (ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌గ్రౌండ్‌) యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను వెర్రెక్కిస్తున్న ప్రమాదకర ఆన్‌లైన్‌ మొబైల్‌ గేమ్‌. మరీ గంటల తరబడి ఈ ఆటలో మునిగితేలుతున్నారు. ఈ గేమ్‌ను ప్రభుత్వం బ్యాన్‌ చేసినా, వివిధ సర్వర్ల ద్వారా పలువురు ఆడుతుండడం గమనార్హం.

ఏమిటీ గేమ్‌...?  పబ్‌జీ.. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ మల్టీప్లేయర్‌ గేమింగ్‌ యాప్‌. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని గేమ్‌లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు. ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్‌ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట. ఆటగాడు చనిపోతే గేమ్‌ అయిపోనట్లే లెక్క.

యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్‌ కిట్‌ వంటివి ఇందులో ఉంటాయి.  అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లో ప్రవేశించాలనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ ఆడేవాళ్లు సుమారు 20కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. దీనికి అలవాటు పడిన వారు చదువులో పూర్తిగా వెనుకబడుతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.  

ఇది కూడా చదవండి  :

 బీజేపీలో చేరిన ఖుష్బూ సుందర్, కాంగ్రెస్ అగ్రనాయకులపై తీవ్ర ఆరోపణలు

ప్రియాంక పై దాడి యోగి ప్రభుత్వం, 'బాధితురాలి గొంతు వినే బదులు, ఆమెను అవమానించడం సిగ్గుచేటు'

కేరళ: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి

Related News