గోదావరి నది, వరికపుడిశెల వాగు వరద జలాలతో దుర్భిక్ష పల్నాటి సీమను సుభిక్షం చేసే పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వరికపుడిశెల వాగుల నుంచి వరద జలాలను ఎత్తిపోసే పనులను వేగంగా పూర్తి చేయడానికి వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుల సంస్థ పేరుతో ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ని ఏర్పాటు చేసింది. బడ్జెట్ కేటాయింపులకు తోడు.. ఎస్పీవీ పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించింది. వీటిద్వారా పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించడంతో పాటు ప్రజల దాహార్తి తీర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాల్లో కృష్ణా డెల్టాకు తరలించగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80 కిమీ వద్దకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి పల్నాడుకు గోదావరి జలాలను తరలిస్తారు. ఈ పనులకు వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పేరుతో రూ.6,020 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి
ఇచ్చింది.
పల్నాడు నుంచి కృష్ణా నదిలో కలిసే వరికపుడిశెల వాగు వరదను ఒడిసి పట్టి.. ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేసే పనులను ప్రభుత్వం చేపట్టింది. వరికపుడిశెల వాగు ఎత్తిపోతల తొలి దశ పనులకు రూ.340 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చింది. భూసేకరణను కొలిక్కి తెచ్చిన ప్రభుత్వం.. పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. మరోవైపు వరికపుడిశెల వాగు ఎత్తిపోతల రెండో దశ పనుల కోసం రూ.1,273 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు
ఇది కూడా చదవండి:
ప్రేమోన్మాది దాడిలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న వలంటీర్ ప్రియాంక
ప్రపంచమంతా ఒకవైపు అంటే నేను మాత్రం మరోవైపు అనేవిధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు
జె&కే లెఫ్టినెంట్ గవర్నర్ యువతను శక్తిని సరైన దిశలో మార్చమని అడుగుతాడు