ఆంధ్రప్రదేశ్ జీవరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా కేంద్రం సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫారసు మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి (ఆర్‌సీఈ) ఆమోదం తెలపాలని కోరారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి.. రాత్రి 9.15 గంటల నుంచి 10.40 గంటల వరకు హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
2017 – 18 ధరల సూచీని పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని, ఈ మేరకు రెండో రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ (ఆర్‌సీఈ)కు ఆమోదం తెలిపేలా కేంద్ర జల శక్తి శాఖకు సూచించాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఒక లేఖ సమర్పించి, అందులో అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ కింద సేకరించాల్సిన భూమి 1,02,130 ఎకరాల నుంచి 1,55,465 ఎకరాలకు పెరిగిందని నివేదించారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్ర స్థాయి సర్వే తర్వాత భూ సేకరణలో 55,335 ఎకరాలు పెరిగిందని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందని వివరించారు. 2018 డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు. సీఎం ఇంకా ఏం కోరారంటే..
ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆగస్టులో ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 తెచ్చింది. ఈ దిశగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధిత శాఖ తీసుకునేలా చూడాలి.కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరం.
రాష్ట్రంలో జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. (రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డేటాను వివరిస్తూ ఒక లేఖ అందజేశారు) వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనికోసం కొత్తగా 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటితోపాటు ఇదివరకే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలి. వీటి అనుమతులకు వెంటనే ఆమోదం తెలపాలి. కాలేజీల ఏర్పాటుకు తగినంత ఆర్థిక సహాయం అందించాలి.
ఇది కూడా చదవండి:
పొరుగు నుంచి బిబి హౌస్ వరకు వివాదాలకు ప్రసిద్ధి చెందిన డాలీ బింద్రా
1,034 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సన్నాహాలు జరిగాయి.
ఏంయుఐఐఆర్సెంటర్ ఎనర్జీ స్వరాజ్ ఆశ్రమంతో వ్యూహాత్మక ఏంఓయు లపై సంతకం చేసింది