తదుపరి విచారణ వరకు ఒప్పందాలు వద్దు,హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

రాష్ట్రంలో రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా నిమిత్తం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) ఆహ్వానించిన టెండర్ల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. బిడ్డింగ్‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డర్లను సైతం ఖరారు చేసుకోవచ్చునని.. అయితే బిడ్డింగ్‌లో విజయం సాధించిన వారితో ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీజీఈసీఎల్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఏపీజీఈసీఎల్‌ జారీచేసిన రిక్వెస్ట్‌ ఫర్‌ సెలక్షన్‌ (ఆర్‌ఎఫ్‌ఎస్‌), విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లను సవాలు చేస్తూ టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీజీఈసీఎల్‌ జారీచేసిన ఆర్‌ఎఫ్‌ఎస్, పీపీఏలు విద్యుత్‌ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు విచారణ జరిపారు.

టాటా పవర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఏపీజీఈసీఎల్‌ జారీచేసిన ఆర్‌ఎఫ్‌ఎస్, పీపీఏలు కేంద్ర విద్యుత్‌ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యుత్‌ చట్ట నిబంధనల ప్రకారం ఏదైనా వివాదం ఏర్పడితే, రెగ్యులేటరీ కమిషన్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు జారీచేసిన ఆర్‌ఎఫ్‌ఎస్, పీపీఏల్లో ఆ నిబంధనను తొలగించారని, ఏదైనా వివాదం తలెత్తితే ప్రభుత్వమే పరిష్కరిస్తుందని పేర్కొన్నారని ఆయన తెలిపారు. 

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఈ ప్రాజెక్టును రైతుల కోసం తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. అసలు టెండర్‌ ప్రక్రియలో టాటా పాల్గొనలేదన్నారు. టెండర్లలో పాల్గొన్న వారికి లేని అభ్యంతరం టాటా పవర్‌కు ఎందుకుని ప్రశ్నించారు. ఏదో రకంగా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఉందని వివరించారు. టెండర్‌ ప్రక్రియ ముగిసిన తరువాత చివరిలో అర్ధరహితమైన అభ్యర్థనతో టాటా పవర్‌ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. అసలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికి వారికున్న అర్హత ఏమిటో చెప్పలేదన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ఆర్‌ఎఫ్‌ఎస్, పీపీఏ ఉన్నాయని శ్రీరామ్‌ తెలిపారు. అసలు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని, తదుపరి విచారణకల్లా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తానని ఆయన కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. టెండర్ల ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, బిడ్డర్లను ఖరారు చేసుకోవచ్చునన్నారు. అయితే.. ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీచేశారు.  

ఇది కూడా చదవండి :

పశ్చిమ బెంగాల్: మమతా బెనర్జీ సినిమా హాళ్లలో 100 పిసి ఆక్యుపెన్సీని అనుమతిస్తుంది

జేఎన్‌టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులు

అగ్ని: ముగ్గురు పిల్లలు కాలిన గాయాలతో మరణించారు, 7 మంది ఉపిరి పీల్చుకున్నారు అని మహారాష్ట్ర మంత్రి చెప్పారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -