ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఆన్‌లైన్ చాటింగ్‌తో దగ్గరయ్యారు. కేవలం పేస్ బుక్ లోని ప్రొఫైల్ ఫొటోలు మినహా ప్రత్యక్షంగా చూసుకోకనే వ్యవహారం పెళ్లివరకూ వచ్చింది. అయితే పెళ్లికి ప్రేమికురాలు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రేమికుడు ఉరితాడుతో సెల్ఫీ తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పట్టణ సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ నాగరాజు కథనం...స్థానిక పల్లె వీధికి చెందిన హరిక్రిష్ణ(22) ఎస్టేట్‌లోని ఈ మగ్గాల పరిశ్రమలో కూలికి వెళ్లేవాడు. కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లోని ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. వీరిద్దరి మధ్య ఆన్‌లైన్ చాటింగ్ కొనసాగింది. అది ప్రేమగా మారి హరిక్రిష్ణ ప్రియురాలికి పెళ్లి చేసుకుంటానని మెస్సేజ్ పంపాడు.
దీనిపై కొన్నాళ్లకు స్పందించిన ప్రియురాలు ఇటీవలే కుదరదని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు మంగళవారం రాత్రి తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ నుంచే లైవ్‌చాట్ చేస్తూ మెడకు ఉరి వేసుకోవడాన్ని సైతం సెల్ఫీ తీసి ప్రియురాలికి పంపాడు. అయినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కార్మికుల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి తన సిబ్బంది ఎస్‌ఐ చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జయరామయ్య మాట్లాడుతూ, ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి, ఒరిజినల్ ఫేస్‌ను చూపెట్టకుండా సాగే ప్రేమాయణాలపై యువత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.