గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

అమరావతి: ‘భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సిద్ధాంతం. అయితే ప్రజల మధ్య మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. సాహసోపేతమైన నాయకత్వం, నవతరం, యువతరంతో కూడిన రాష్ట్ర మంత్రి మండలి ఏపీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కోవిడ్‌ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్‌ టెస్టుల నిర్వహణలో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుందని, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా అమలవుతున్నాయని చెప్పారు. గవర్నర్‌ ఇంకా ఏమన్నారంటే

ప్రాంతీయ సమానాభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు నిర్ణయంతో ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తాం. రాష్ట్రం పెట్టుబడిదారులకు, పర్యాటకులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉండబోతోంది. 2020–23 కొత్త పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగకర్త బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మారక ఉద్యానవనం ఏర్పాటు కాబోంది.

జగనన్న అమ్మ ఒడి కింద 44.49 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు జమ. జగనన్న విద్యా కానుక కింద రూ.648 కోట్లతో 42,34,322 మంది విద్యార్థులకు స్కూల్‌ కిట్లు. జగనన్న గోరుముద్ద కింద రూ.1,456 కోట్లతో 36,88,618 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యా దీవెన కింద ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4,101 కోట్లు చెల్లింపు. జగనన్న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేల వరకు సాయం. ఇందుకు రూ.1,221 కోట్లు చెల్లింపు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం. మనబడి నాడు–నేడు కింద 45,484 స్కూళ్లు, 471 జూనియర్‌ కళాశాలలు, 171 డిగ్రీ కాలేజీలు, 3,287 çహాస్టళ్లు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు దశల్లో రూ.16,500 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్పు. 

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం రేషన్‌ డోర్‌ డెలివరీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.830 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 9,260 మొబైల్‌ వాహనాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్‌ 25న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టింది. రెండు దశల్లో 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 28.30 లక్షల ఇళ్లు వస్తాయి. మొదటి విడతగా రూ.28,084 కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది.  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి 95 శాతం మంది ప్రజలు. ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లతో 9.89 లక్షల మందికి ప్రయోజనం. ఈ పథకం పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 2,436కు పెంపు. వైఎస్సార్‌ కంటి వెలుగు కింద రూ. 53.85 కోట్లతో 67.69 లక్షల మందికి కంటి పరీక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 వేల కోట్లతో 10,500 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం. 108, 104 సేవల కోసం 1,088 అంబులెన్స్‌ల కొనుగోలు. 

 వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మొదటి దశలో 8.71 లక్షల డ్వాక్రా గ్రూపులకు చెందిన 87 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.6,792 కోట్లు జమ. వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 23 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల సాయంలో భాగంగా మొదటి విడత డబ్బు జమ. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ఇప్పటి వరకు రూ.26,553 కోట్లు చెల్లింపు. 62 లక్షల మందికి ప్రయోజనం. మహిళలకు నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పన. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి వరకు రూ. 4,092 కోట్లు చెల్లింపు.

 ఇది కూడా చదవండి:

టాండావ్ వివాదం: ఎఫ్ఐఆర్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు చేరిన మేకర్స్ బృందం

హైదరాబాద్‌కు చెందిన అమాయకుడు కరెంట్‌లో చేతులు, కాళ్లు కోల్పోయాడు

బర్త్ డే స్పెషల్: ఈ సినిమాతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న రియా సేన్

 

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -