దేవరాపల్లి నుంచి వెండితెరపైకి

ఆ కుర్రాడికి ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పల్లెను వదిలి.. పట్టణం బాటపట్టాడు. ఎం.కాంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. ఆ పట్టాను సినీ ఇండస్ట్రీలో ప్రవేశానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ముందుగా సినిమా నిర్మాణ సంస్థలో అకౌంటెంట్‌గా చేరాడు. ఒక వైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమా రంగంపై అవగాహన పెంచుకున్నాడు. అలా సినీ ప్రముఖులతో పరిచయాలు మొదలయ్యాయి. సీన్ కట్ చేసే  విశాఖ వేదికగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో తనే హీరోగా నటించి భవిష్యత్‌కు పునాది వేసుకున్నాడు. అతనే దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి ఎన్నేటి.. అతను నటించిన హెచ్‌ 23 చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అతనితో ‘సాక్షి’చిట్‌చాట్‌.

తల్లిదండ్రుల ప్రోత్సాహమే నటుడిని చేసింది నటనపై నాకున్న ఆసక్తిని చూసి నాన్న ఎన్నేటి అప్పారావు, అమ్మ రమణమ్మలు ప్రోత్సహించారు. అలా పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి చేరుకున్నాను. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఒకవైపు పీజీ చదువుకుంటూనే లఘు చిత్రాలు తీశాను. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి.. ఆ చిత్రాలకు వచ్చిన స్పందనను బేరీజు వేసుకున్నాను. 

విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్‌ క్రియేషన్‌ సంస్థను ఏర్పాటు చేశా. ఈ క్రియేషన్‌ కింద ‘వైజాగ్‌’పాటను చిత్రీకరించాం. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను పాట రూపంలో వినిపించాం. మా శ్రమకు మంచి స్పందన లభించింది. యూట్యూబ్, సోషల్‌ మీడియాలో ఈ పాట వైరల్‌ అయింది. అనంతరం చిత్రలహరి వెబ్‌ సిరీస్‌ చేశా. ఈ సిరీస్‌ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించింది.  

షార్ట్‌ ఫిల్మ్‌లకు వచ్చిన స్పందనతో హెచ్‌ 23 సినిమాను విశాఖ వేదికగా పూర్తి చేశాను. బి.టెక్‌ బాబులు ఫేం ఇమంది శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది.
 

యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా హర్రర్‌తోపాటు కామెడీ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. నేను హీరోగా, మౌనరాగం ఫేం కవిత, శ్రీజ హీరోయిన్లుగా నటించాం. పలు లఘు చిత్రాల్లో ప్రతిభ చూపిన వారిని మిగిలిన పాత్రలకు ఎంపిక చేశాం. ఇదే బ్యానర్‌పై మరో రెండు చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. సస్పెక్ట్‌ , జగన్నాటకం చిత్రాలకు సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తి చేశాం. హెచ్‌–23 చిత్రాన్ని ఆదరించండి. చిన్న చిత్రానికి గొప్ప విజయం అందించి నన్ను ఆశీర్వదించండి అంటూ ముగించారు

ఇది కూడా చదవండి:

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ

రాజధానిలో 99వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

ప్రణబ్ ముఖర్జీ పుస్తకం, 'మోడీ పీఎం పదవిని సంపాదించగా, మన్మోహన్ సోనియా గాంధీ నుంచి పొందారు'

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -