హైదరాబాద్: లేకలేక ఆ దంపతులకు పుట్టిన ‘కనుపాప’ను వైద్య నిర్లక్ష్యం దూరం చేసింది. దృష్టి లోపాన్ని సరిదిద్దుకొని రంగుల ప్రపంచాన్ని చూడాలనుకున్న ఆ చిన్నారిని మత్తుమందు శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. మోతాదుకు మించి అనస్తీ్తషియా ఇవ్వడం వల్ల కంటి సర్జరీకి ముందే ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆల్విన్ కాలనీ సమీపంలోని శంషాగూడకు చెందిన పానీపూరి వ్యాపారి గణపతిరెడ్డి, కీర్తి దంపతులకు పెళ్లైన పన్నెండేళ్ల తర్వాత కుమారుడు ప్రశాంత్ (12) జన్మించాడు. అయితే చిన్నతనం నుంచే అతనికి కంటిచూపు సరిగా లేదు. దీంతో తమ కుమారుడికి చికిత్స చేయించాలని తల్లిదండ్రులు భావించారు.
ఈ నెల 20న పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు రెండు కళ్లలోనూ పొరలున్నాయని, వాటిని తొలగించేందుకు రెండింటినీ ఒకే సమయంలో సర్జరీ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఈ నెల 21న వైద్యులు సర్జరీకి సిద్ధమయ్యారు. చికిత్స సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియనిస్ట్ మత్తుమందు ఇచ్చాడు. అయితే మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో బాలుడు చికిత్సకు ముందే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు