సొంత గనుల కేటాయింపే ప్రథమ మార్గం.. ప్లాంట్‌ రుణాలను వాటాల రూపంలోకి మార్చాలి

అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలువరించేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, ఆ దిశగా తొలుత ఆలోచించాలన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనలే అత్యుత్తమ మార్గాలని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది కాలంగా వస్తున్న నష్టాలను సాకుగా చూపి, నీతి ఆయోగ్‌ చెప్పింది కాబట్టి స్టీల్‌ ప్లాంట్‌ను గంప గుత్తగా అమ్మేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం సబబు కాదంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచి, లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను ప్రతిపాదించారు. 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న ఈ ప్లాంట్‌ గత డిసెంబర్‌లో 6.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పని చేసిందని, తద్వారా రూ.200 కోట్లు ఆర్జించిందన్నారు.

ఇదే రీతిలో ప్లాంటు రెండేళ్ల పాటు నడిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని వివరించారు. – ముడి ఖనిజానికి అదనపు చెల్లింపుల వల్ల ప్లాంట్‌పై రూ.3,472 కోట్ల భారం పడుతోందని.. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను కేటాయించడం ద్వారా ప్లాంట్‌ను తిరిగి ప్రగతి బాటలోకి తీసుకెళ్లొచ్చని సూచించారు. ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌ ఎన్‌ఎండీసికి చెందిన బైలదిల్లా గనుల నుంచి మెట్రిక్‌ టన్ను రూ.5,260 చొప్పున మా ముడి ఖనిజాన్ని కొనుగోలు చేస్తోందని, ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌కు ఇదే అత్యంత ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు.

పోటీ పరిశ్రమలన్నింటికీ సొంతంగా గనులు ఉన్నాయని, 60 శాతం ముడి ఖనిజం అవసరాలను సొంత గనుల ద్వారా తీర్చుకుంటూ, మిగిలిన 40 శాతం మాత్రమే ఎన్‌ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. సెయిల్‌కు 200 ఏళ్లకు సరిపడా ముడి ఖనిజం అవసరాలను తీర్చే గనులున్నాయని ఆ లేఖలో తెలిపారు. రుణాలను వాటాల రూపంలోకి మార్చొచ్చు స్టీల్‌ ప్లాంట్‌ చెల్లించాల్సిన రుణాలను వాటాల రూపంలోకి మార్చితే ఒత్తిడి తగ్గుతుందని, వడ్డీల బెడద కూడా ఉండదని సీఎం తెలిపారు. రూ.22 వేల కోట్ల రుణాలకు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి, స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్టింగ్‌ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్‌ ఆప్షన్‌ కలిగించవచ్చనని సీఎం పేర్కొన్నారు. తద్వారా ప్రజల నుంచి కూడా నిధుల సమీకరణకు అవకాశం ఏర్పడుతుందని, ప్లాంట్‌ సవ్యంగా నడుస్తుందని వివరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వేలాది ఎకరాల భూములున్నాయని ప్లాంట్, టౌన్‌షిప్‌కు పోగా మిగిలిన భూముల్లో గ్రీన్‌ సిటీ (ప్లాట్లు వేయడం) ఏర్పాటు చర్యలు తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, ఇందుకు రాష్టప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని సీఎం సూచించారు. ఈ డబ్బు ప్లాంట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడటానికి ఆ నష్టాలేవో కేంద్ర ప్రభుత్వమే భరించాలని, లేదా ఆ నష్టాలను మాఫీ చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్లాంట్‌ ఉద్యోగులూ ఇదే విషయం చెబుతున్నారు. ఇందుకు నీతి అయోగ్‌ లేదా మరెవరో అభ్యంతరం పెడతారనుకుంటే ఒఎన్‌జీసీనో, లాభాల్లో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో టేకోవర్‌ చేసేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు.గతంలో ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయని ఉదహరిస్తున్నారు. ప్లాంట్‌కు ఉన్న మిగులు భూమిని టెండర్లు పిలిచి మంచి ధరకు విక్రయించవచ్చని, లేదా దీర్ఘకాలం లీజుకు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బును ప్లాంట్‌కు కేటాయించి, నష్టాలు తగ్గించుకోవడానికి కొత్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ఇది కూడా వీలు కాదనుకుంటే దుర్గాపూర్‌ స్టీల్స్‌ తరహాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లొచ్చు. సొంత గనులు కలిగి ఉన్నప్పటికీ ‘సెయిల్‌’ నష్టాల్లో ఉందని, సొంత గనులు లేని విశాఖ స్టీల్స్‌ గత ఏడాది రూ.200 కోట్ల లాభాలు ఆర్జించిన విషయాన్ని విస్మరించడం బాధాకరం అని ప్లాంట్‌ ఉద్యోగులు వాపోతున్నారు. ప్లాంట్‌ను ఆదుకోవడానికి ఇన్ని ప్రత్నామ్నాయాలు ఉండగా ఏకంగా ప్రైవేటీకరణే అనడం తగదంటున్నారు. 

ఇది కూడా చదవండి:

అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2021 నుంచి ప్రారంభం కానుంది.

త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోనుందట అనుష్క శెట్టితో కాదు, పెళ్లి కూతురు ఎవరు అనే విషయం కూడా తెలుస్తుంది.

ఈ సినిమా గురించి యువకుడు బెదిరింపు ట్వీట్ పంపాడు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -