పెద్దదోర్నాల: ప్రశాంతగా ఉన్న నల్లమలపై మళ్లీ వేటగాళ్ల కన్ను పడింది. కొంతకాలంగా ఎటువంటి అలజడి లేకుండా ఉన్న అభయారణ్యంలో ఓ చిరుతను వేటాడి మరీ దాని చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించి కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వన్యప్రాణులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అటవీ శాఖాధికారులు నిర్వహించిన దాడులలో ఓ యువకుడు చిరుత చర్మంతో పట్టుబడ్డాడు. ఈ ఘటనలో కొందరు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావటంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణపై చేపట్టారు.
నల్లమలలో దొరికిన చిరుత చర్మం కేసులో అటవీశాఖ సిబ్బంది ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పట్టబడిన నిందితుడు నాగరాజు సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయట పడ్డట్టు సమాచారం. అందులో పెద్దదోర్నాల రేంజి అధికారికి జీప్ డ్రైవర్‌కి సంబంధించిన పూర్తి కాల్ డేటా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు డ్రైవరును అదుపులోకి తీసుకుని పూర్తి స్దాయిలో విచారిస్తున్నారు. జీప్ డ్రైవరుతో పాటు అతనికి సోదరుడి వరుసైన మరో యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అటవీశాఖాదికారుల అదుపులో ప్రస్తుతం డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు వి«శ్వసనీయ సమాచారం