చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓబనపల్లెకు చెందిన మునిరత్నం, పట్టమ్మ కుమార్తె ధనలక్ష్మి (28)కి పదేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరుకు చెందిన ముత్తుతో వివాహమైంది. వీళ్లకు ఝాన్సి (8), ఉదయ్ పిల్లలు ఉన్నారు. ముత్తు తాపీమేస్త్రీగా, ధనలక్ష్మి హైరోడ్డులోని ఓ హోటల్‌లో కూలీగా పనిచేసేవారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్నపాటి గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ముత్తు తన సొంతూరికి వెళ్లిపోగా, ధనలక్ష్మి ఓబనపల్లెలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, కుమారుడిని ఒకటో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ధనలక్ష్మి ఒంటరితనాన్ని భరించలే పోయింది. తల్లిదండ్రులతో సైతం పలుమార్లు మనస్పర్థలు రావడంతో మరింత కుంగిపోయింది.
ఈనెల 4వ తేదీ సాయంత్రం పిల్లలతో సహా ధనలక్ష్మి కనిపించకుండాపోయింది. భర్త వద్దకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఆపై రెండు రోజుల పాటు అన్నిచోట్లా విచారించారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 6వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, తెలిసిన వాళ్ల చిరునామాల్లో వెతకడం ప్రారంభించారు. ధనలక్ష్మి తన సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే వదలివెళ్లిపోవడంతో కేసు కొలిక్కిరాలేదు. శుక్రవారం ఉదయం ఓబనపల్లె వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలాయి. గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశారు