రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్‌ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే.
జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం
జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్‌లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు.
రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు:
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్‌ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్‌సీ సుబ్బారెడ్డి తెలిపారు. గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు.కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇది కూడా చదవండి:
సెలీనా గోమెజ్ లాక్ డౌన్ కాలంలో డిప్రెషన్ కు లోనయింది; వెల్లడించారు
హెమ్స్ వర్త్ బ్రదర్స్ ఆస్ట్రేలియా కు సమీపంలోని ఒక ప్రైవేట్ ద్వీపంలో సెలవులను ఆస్వీస్తున్నారు
హాలీవుడ్ స్టార్ పీట్ డేవిడ్ సన్ జె.కె. రౌలింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.