కొండప్రాంతాల్లోని ప్రజలను వణికిస్తున్న చలి

శీతాకాలం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. దీంతో ఇంట్లో ఏసీల వాడకం తగ్గింది. స్వెట్టర్లు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇక్కడ చలిమంటల (క్యాంప్‌ ఫైర్‌) వేస్తూ, చల్లటి వాతావరణంలో వేడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం పది వరకూ పొగమంచు తెరలు వీడటంలేదు. దీంతో రహదారులు కానరాక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పొగమంచు సమయంలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రవాణా, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 9, చింతపల్లిలో 12.2, పాడేరులో 12, అరకులో 14 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగరంలో కనీస ఉష్ణోగ్రత సాధారణం కంటే 3, కళింగపట్నంలో 2 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైంది. 

చలి పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండ వచ్చిన తర్వాత వెళ్లాలని చెప్పారు. చలి నుంచి రక్షణకు ఊలు కోటు, మంకీక్యాప్‌/మఫ్లర్‌ వాడటం ఉత్తమని, ఉదయం గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలని, ఆస్తమా బాధితులు చలి ప్రాంతాలకు వెళ్లరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్ధి సూచించారు. చర్మసంబంధిత సమస్యలు కూడా చలికి ఎక్కువవుతాయని వైద్య నిపుణులు చెప్పారు.  

రాయలసీమలో పరిస్థితి మాత్రం కోస్తాకు భిన్నంగా ఉంటుందని, ఈసారి ఆ ప్రాంతంలో చలి వణికించనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం, రాత్రి సాధారణం కంటే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుదల కనిపిస్తుందన్నారు.  

ఇది కూడా చదవండి:

ఫ్లోరిడా లో బిజినెస్ మ్యాన్ అపరిచితులకు యుటిలిటీ బిల్లుల బకాయి చెల్లించాడు

ఆఫ్ఘనిస్థాన్: కాందాహార్ లో 60 మంది తాలిబన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

సుప్రీంకోర్టు ఓటమి రిపబ్లికన్లను మాటలు లేకుండా చేసింది, యుఎస్ ఎన్నికలు 2020

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -