ముందు ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్న కారు,ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన ఘటన మార్టూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న రెండు జంటలు ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. పోలీసులు, 108 సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసే రేకందారు కనక మహాలక్ష్మి (58), బలిజ సత్యనారాయణ(63) భార్యభర్తలు. అదే కోర్టులో అడ్వొకేట్‌గా పనిచేసే వీరి సమీప బంధువు పర్వతనేని విజయలక్ష్మి (58), ఉయ్యూరు రవీంద్రనాథ్‌ చౌదరి అలియాస్‌ చినబాబు (60)లు దంపతులు.

ఈ రెండు కుటుంబాలు ఏలూరు పట్టణంలోని ఫతేబాద్‌ కాలనీ అగ్రిగోల్డ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాయి. చినబాబుకు గతంలో భార్య మరణించగా గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన విజయలక్ష్మితో వివాహమైంది. ఈ రెండు కుటుంబాలతో పాటు కనక మహాలక్ష్మి మేనల్లుడు అయిన ఎం.సందీప్‌తో కలిసి మొత్తం ఐదుగురు నాలుగు రోజుల క్రితం కారులో వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. తిరిగి ఏలూరు ప్రయాణం కాగా చినబాబు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. కారు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్థానిక అంబేడ్కర్‌ కాలనీ ఎదురు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ 50 మీటర్లకు పైగా ముందుకు దూసుకెళ్లి.. వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును సైతం తనతో లాక్కొని వెళ్లిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -