నగర, పట్నవాసులు పల్లెబాట పట్టారు. అల్లుళ్లు, ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో పల్లెల్లో కొంగొత్త సంక్రాంతి కళ సంతరించుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్నాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయిన వారందరితో ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఇంటి ముంగిటా సస్తవర్ణశోభితమైన రంగవల్లులు భోగి పండుగకు స్వాగతం పలికాయి. కొక్కొరోకో అంటూ. తొలి కోడి కూయగానే పల్లెల్లో నువ్వు ముందా.. నేను ముందా.. అని పోటీ పడిన చందంగా భోగి మంటలు వెలిగించారు. చలి వాతావరణంలో భోగి మంటల వద్ద ఆనందంగా గడిపారు. సూర్యోదయానికి ముందే మహిళలు ఇళ్ల ముందు కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు వేసి రంగులద్దారు. రంగవల్లుల మధ్యలో గోవు పేడతో చేసిన గొబ్బమ్మలను ఉంచి పుష్పాలతో అలంకరించారు. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా డూడూ బసవన్నలు (గంగిరెద్దులు) పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే నుదుట నామాలు ధరించిన హరిదాసుల సంకీర్తనలు వీనుల విందు గొలుపుతున్నాయి. పట్టణాలు, నగరాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన వారితో పల్లెల్లో కార్ల సందడి నెలకొంది.
వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ప్రభావం సంక్రాంతిపై స్పష్టంగా కనిపిస్తోంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అల్పాదాయ వర్గాలకు లబ్ధి కలగడంతో పండుగకు కొత్త కళ వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సాయం, అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌లో ఏటా రూ.15,000 జమ చేస్తుండటం గమనార్హం. తాజాగా ఈనెల 11న 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి కింద ప్రభుత్వం రూ.6,673 కోట్లు జమ చేసింది. డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,250 పింఛను అందిస్తోంది. 30.76 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇచ్చి, 28 లక్షల మందికి ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి గత నెల 25న శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీతో ఈ ఏడాది పల్లెల్లో ముందే సంక్రాంతి కళ సంతరించుకుంది. వర్షాలు పడటంతో పంటలు బాగా పండుతున్నాయి. కూలీలకు చేతి నిండా పని లభిస్తోంది. డబ్బు చేతికి అందినందున ప్రతి కుటుంబం ఉన్నంతలో ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటోంది.
పెద్దల పండుగ, కనుమ నేపథ్యంలో రంగవల్లులతో ఇళ్లు నూతన శోభ సంతరించుకున్నాయి. భోగభాగ్యాలు పంచే భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ప్రతి గడప ముంగిటా భోగి మంటలు వేయడంతో పల్లెల్లో మబ్బులోనే వెలుగులు చిమ్మాయి. పిల్లల తలపై రేగి పండ్లు, చిల్లర నాణేలను పోసి ముత్తయిదువులు దీవించారు. ఈ ఏడాది ఉద్యోగులకు సంక్రాంతి భాగా కలిసొచ్చింది. దాదాపు వారం రోజులు సెలవు లభించినట్లయింది.
ప్రతి కుటుంబానికి నాలుగైదు ప్రభుత్వ పథకాలు అందడం వల్ల ఈ ఏడాది మాతోపాటు అందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద డబ్బు అందింది. నా భార్య లక్ష్మికి వైఎస్సార్ చేయూత కింద సాయం అందింది. మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి ఇంటి స్థలం వచ్చింది. నా భార్యతోపాటు కోడళ్లకు డ్వాక్రా ద్వారా రుణ మాఫీ ప్రయోజనం లభించింది. ఈ ఆనందకర సంక్రాంతికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉండటమే కారణం.
ఇది కూడా చదవండి:
ఈ నటి తన రాబోయే షో 'తేరీ మేరి ఇక్ జింద్రీ' కోసం హెవీ బైక్ రైడింగ్ నేర్చుకుంటుంది
భారత్ కరోనావైరస్: గడిచిన 24 గంటల్లో అనేక కొత్త కేసులు నమోదయ్యాయి