పాఠశాలకని వెళ్లి.. విగత జీవులయ్యారు పాలేటిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

పీసీపల్లి:  గణతంత్య్ర దినోత్సవం రోజున హుషారుగా పాఠశాలకని వెళ్లిన పిల్లలు సెలవు రోజని సరదాగా ఈతకు వెళ్లి వాగులో మునిగి విగత జీవులుగా మారిన ఘటన పీసీపల్లి మండలం బట్టుపల్లి సమీపంలో ఉన్న పాలేటివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏరువారిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ కనిగిరి మండలం వాగుపల్లి గ్రామానికి చెందిన సాలమ్మ రవీంద్ర కుమారుడు ముప్పూరి లక్ష్మీనారాయణ (14) 9వ తరగతి, కొత్త ఏరువారిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీదేవి, గురవయ్యల కుమారుడు మేకల కార్తీక్‌ (13) 8వ తరగతి చదువుతున్నారు. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైస్కూల్‌కు వచ్చిన వారు కార్యక్రమంలో పాల్గొని మిఠాయిలు తిని వారికి పోటీల్లో వచ్చిన బహుమతులతో సంతోషంగా గడిపారు.

సెలవు రోజు కావడంతో సరదాగా ఈతకు వెళ్దామంటూ 20 మంది మిత్రులతో కలిసి పాలేటివాగు దగ్గరకు వచ్చారు. ముందు మీరు నీళ్లలోకి దూకి లోతు చూడటమంటూ తోటి విద్యార్థులు ప్రోత్సహించడంతో లక్ష్మీ నారాయణ, మేకల కార్తీక్‌ వాగులోకి దూకారు. ఎక్కువ లోతు ఉండటం, ఈత రాకపోవడం, నీరు ప్రవహిస్తుండటంతో లోతైన చోటుకు జారుకుంటూ పోయి అడుగుకు వెళ్లిపోయారు. వారు ఎంతకూ బయటకు రాకపోవడంతో భయంతో ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు పరిగెత్తుకుంటూ ఊరులో అందరికీ చెప్పి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో  పీసీపల్లి ఎస్సై ప్రేమకుమార్, మరో నలుగురు గత ఈతగాళ్లతో స్వయంగా వాగులో దిగి వెతికి ఆ పిల్లలిద్దరినీ బయటికి తీశారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. గ్రామస్తులు విగత జీవులైన పిల్లలను చూసి బోరుమంటూ విలపిస్తున్నారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -