విజయవాడ: ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో రాజకీయం వేడెక్కుతోంది. తొలివిడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరకు రావడంతో ఆఖరు ప్రయత్నాలుగా బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు తెరవెనుక సర్దుబాట్లకు ఆరాటపడుతున్నారు. వద్దంటున్నా నామినేషన్ దాఖలు చేయించడంతో పోటీలో తాము కొనసాగలేమని పలువురు మొత్తుకుంటున్నా, తప్పనిసరిగా బరిలో ఉండేలా చూడాలని ఆయా పారీ్టల అధిష్టానాలు సూచిస్తున్నాయి. చివరి వరకు పోటీలో కొనసాగించేదెలాగో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోపాయికారీ పొత్తులకు ఇరు పార్టీలు తెర వెనుక మంతనాలు చేస్తున్నాయి.
సామాజిక వర్గాల వారీగా మద్దతు పొందే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కంకిపాడులో వార్డు అభ్యర్ధులకు మద్దతు విషయంలో టీడీపీ, జనసేనల మధ్య అంతర్గత ఒప్పందం జరుగుతోందని సమాచారం. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. తుమ్మలపాలెంలోనూ టీడీపీ. జనసేనలు కలిసి పోటీకి ఎన్నికల బరిలో దింపారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి మద్దతుగా పనిచేయడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం జిల్లా టీడీపీ నాయ కులు సొంత వ్యాపారాలకు పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, చంద్రబాబు పర్యటనల సందర్భంగా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పాటు అన్ని పంచాయతీల్లోనూ అభ్యర్ధులను నిలపాలని అదిష్టానం ఆదేశించడంతో స్థానిక నాయకులు మల్లుగుల్లాలు పడుతున్నారు. పలు చోట్ల అభ్యర్ధులు దొరకని పంచాయతీల్లో జనసేన పార్టీ సానుభూతిపరులను బలపరుస్తూ వారితో నామినేషన్ లు వేయించారని, తరువాత దశ ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగించడానికి అవగాహనతో ఆ రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి :
డాక్టర్ మరణాలపై కేంద్రం డేటాను తిరిగి క్లెయిమ్ చేసిన ఐఎమ్ ఎ, కోవిడ్ లో 744 మంది మృతి
'జబ్ పుచ్ జలేగి ట్యాబ్' అంటూ పార్టీని వదిలి వెళ్లిన టీఎంసీ నేతలపై మండిపడ్డారు.