ఆద్యంతం అభివాదం చేస్తూ చిరునవ్వుతో కనిపించిన సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి: మువ్వన్నెల రెపరెపలు సాయుధ దళాల కవాతులు భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం మురిసింది. 72వ భారత గణతంత్ర దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుష్పాలంకృతమైన ప్రత్యేక వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. స్టేడియం గ్యాలరీలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏపీ స్పెషల్‌ బెటాలియన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు శంకబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు రంపచోడవరం ఏఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ నేతృత్వం వహించారు. 

గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం సాయుధ పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది. ఇండియన్‌ ఆర్మీ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ (కర్నూలు), 3వ బెటాలియన్‌ (కాకినాడ), 9వ బెటాలియన్‌(వెంకటగిరి), 14వ బెటాలియన్‌ (అనంతపురం), 16వ బెటాలియన్‌ (విశాఖ) బృందాలతోపాటు 2, 3, 6, 9, 11, 14 బెటాలియన్‌లకు చెందిన బ్రాస్‌ బ్యాండ్‌ బృందాలు, మంగళగిరి పోలీస్‌ పైప్‌ బ్యాండ్, హైదరాబాద్‌ ఏపీ యూనిట్‌ కవాతులు కనువిందు చేశాయి. కవాతు ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇండియన్‌ ఆర్మీ, ఏపీఎస్‌పీ 16వ బెటాలియన్‌(విశాఖ), సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల స్కాట్‌లాండ్‌ పైప్‌లైన్‌ బ్యాండ్‌ బృందాలకు  ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గవర్నర్‌ హరిచందన్‌ ప్రదానం చేశారు

సీఎం జగన్‌ నేతృత్వంలో అమలు జరుగుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన ప్రభుత్వ శకటాలు ప్రగతి రథ చక్రాలుగా కదిలాయి. నవరత్నాల వెలుగులను రాష్ట్రం నలుదిశలా ప్రసరిస్తున్న వైనాన్ని వివరిస్తూ శకటాలు ముందుకు సాగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన 14 శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో వ్యవసాయ (విత్తనం నుంచి అమ్మకం వరకు రైతు భరోసా కేంద్రాలు), పశు సంవర్థక (జగనన్న పాల వెల్లువ, జీవక్రాంతి పథకం), డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ (ప్రజలకు నాణ్యమైన వైద్యం, విలేజ్‌ క్లినిక్‌లు), వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం (కోవిడ్‌ వ్యాక్సిన్, పరీక్షలు, జాగ్రత్తలపై శకటం), గ్రామ–వార్డు సచివాలయాలు, సమగ్ర శిక్షా–పాఠశాల విద్యాశాఖ (నాడు–నేడు, మన బడి), మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ (వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్‌ విద్యా విధానం, అంగన్‌వాడీ కేంద్రాలు, న్యూట్రీ గార్డెన్స్‌), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)(కరోనా కష్టకాలంలో ప్రజలకు వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ బీమా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ), గృహ నిర్మాణం (నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు), రెవెన్యూ (సర్వే సెటిల్‌మెంట్‌–మీ భూమి మా హామీ), పరిశ్రమలు (పారిశ్రామికాంధ్రప్రదేశ్‌), అటవీ (జీవ వైవిధ్య పరిరక్షణ), పర్యాటక (వేంకటేశ్వరస్వామి ఆనంద గోపురం, దశావతారాలు, ఏనుగు అంబారీ, కొండపల్లి కొయ్యబొమ్మ, కూచిపూడి నృత్యం)లు ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ, వ్యవసాయ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. 

 ఇది కూడా చదవండి:

గణతంత్ర వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి

ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

ఏసీబీ అధికారి ఎం.శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం

యుఎస్ హౌస్ ప్రతినిధులు ట్రంప్ అభిశంసన అభియోగాన్ని సెనేట్‌కు అందజేస్తారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -