నగరంలో ఓ మహిళ దారుణ హత్య కు గురైంది

Jan 11 2021 03:15 PM

నగరంలో ఓ మహిళ దారుణ హత్య కు గురైంది. అనుమానంతో ప్రియుడే ఆమెను కడతేర్చాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్‌కు చెందిన శంకర్‌ అనే రాడ్‌బెండర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌తేజ్, యశ్వంత్‌ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి సహజీవనం చేశారు. రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్‌లో చేర్పించింది

యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు

నీ మరదల్ని చంపేశా. వెళ్లి దాన్ని చూసుకోండి’ అంటూ యశోద బావ (అక్క విజయలక్ష్మి భర్త) సంజీవ్‌కుమార్‌కు ఆదివారం ఉదయం మల్లికార్జున ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో సంజీవ్‌కుమార్‌ దంపతులు హుటాహుటిన అశోక్‌నగర్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. దీంతో అక్క విజయలక్ష్మి బోరున విలపించింది. తన చెల్లిని చంపి పిల్లలిద్దరినీ అనాథల్ని చేశాడంటూ మల్లికార్జునకు శాపనార్థాలు పెట్టింది. వన్‌టౌన్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.  

ఇది కూడా చదవండి:

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాలు ఉన్నాయని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ

భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు,పాడె మోసిన సోదరి

ఎస్‌బీఐ కన్సార్టియం నుంచి రూ.4,736.57 కోట్లు కొల్లగొట్టిన కేసు

Related News