బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్లు కొల్లగొట్టిన మరో బడా సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ కొరడా ఝుళిపించింది. పవర్ ప్రాజెక్టులు, మినీ డ్యామ్‌లు, వాటర్ సప్లయి స్కీమ్స్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టే ప్రముఖ సంస్థ అయిన కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సీబీఐ దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కన్సార్టియం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది.
ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్‌లలో శనివారం, ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, పలు ముఖ్యమైన ఆధారాలు సేకరించింది. వివరాలివీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ఎస్‌బీఐ నేతృత్వంలోని ఐడీబీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూబీఐ, ఎగ్జిమ్ బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.4,736.57 కోట్లు రుణం తీసుకుంది. వీటిని తిరిగి చెల్లించకుండా అవకతవకలకు పాల్పడింది.
ఈ సంస్థ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల సహకారంతో పథకం ప్రకారం బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసింది. 2013 అక్టోబర్ 28 నుంచి అక్రమాలకు తెరలేపింది. 2013–18 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు, నకిలీ పత్రాలు, ఫేక్ ఖాతాలతో మోసాలకు పాల్పడడమే కాక తీసుకున్న రుణాలను తప్పుడు మార్గంలో ఇతర ఖాతాలకు మళ్లించిందని సీబీఐ తెలిపింది. కాగా, సంస్థ చైర్మన్ సబ్బినేని సురేంద్రతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ హరిహరరావు, డైరెక్టర్లు శ్రీధర్ చంద్రశేఖరన్, శరద్ తదితరులపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి:
ఆర్సీహెచ్ పోర్టల్‌కు వివరాల అనుసంధానంలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది